జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ప్రారంభం.

 


జేఈఈ మెయిన్ రెండో విడుత పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షా సంస్థ ఎన్‌టీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌-2021 పరీక్షలను నిర్వహిస్తున్నారు. కంప్యూ‌టర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) విధా‌నంలో జరిగే ఈ పరీక్షలను ఈ నెల 18వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 331 నగరాల్లో 852 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెష‌న్లల్లో పరీక్ష జరు‌గనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ జరగనుంది. జేఈఈ మార్చి పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ ఇప్పటికే అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ nta.ac.in లో ఉంచింది. రెండో విడత జేఈఈ మెయిన్‌ కోసం దేశ‌వ్యా‌ప్తంగా 5 లక్షల మంది విద్యా‌ర్థులు దర‌ఖాస్తు చేసు‌కోగా, తెలం‌గాణ నుంచి 50 వేలకు పైగా విద్యా‌ర్థులు పరీక్ష రాయ‌ను‌న్నారు. తెలం‌గా‌ణలో గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌, వరం‌గల్‌, ఖమ్మం, కరీం‌న‌గర్‌, నల్లగొండ, నిజా‌మా‌బాద్‌, సిద్ది‌పేట, మహ‌బూ‌బా‌బా‌ద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులు రెండుగంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చేవారిని లోపలికి అనుమతించరు. విద్యార్థులు అడ్మిట్ కార్డుతోపాటు.. తమకు కరోనా లేదని సెల్ఫ్ కోవిడ్ డిక్లరేషన్ ఫాంను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏదో ఒక గుర్తింపు కార్డును, పాస్ పోర్ట్ ఫొటోను, ఎన్టీఏ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ధ్రువపత్రాలను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు చేపడుతున్నారు. ముందుగా ఈ పరీక్షలను నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎన్టీఏ ఈ పరీక్షను మూడు రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.