ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం ..

 


అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నుంచి తప్పుకొనున్నాడు. ఇప్పటికే నాలుగో టెస్ట్‌తో పాటు మొత్తం ఐదు టీ20ల సిరీస్‌కు కూడా బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల కారణంగా బుమ్రా నాలుగో టెస్ట్‌కు అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ మార్చి 23 నుంచి పుణెలో జరగనుంది. వ్యక్తిగత కారణాల కారణంగా తనను టీమ్ నుంచి రిలీజ్ చేయాల్సిందిగా జస్ప్రీత్ బుమ్రానే కోరాడని, అందుకే అతన్ని నాలుగో టెస్ట్ ఎంపికకు పరిగణలోకి తీసుకోవడం లేదని బీసీసీఐ ఇదివరకే ట్వీట్ చేసింది. చెన్నైలో మొదటి టెస్ట్ ఆడిన బుమ్రా.. రెండో టెస్టు ఆడలేదు. మోతేరాలో మూడో టెస్ట్ మొత్తం స్పిన్నర్లదే హవా ఉండటంతో బుమ్రా తుది జట్టులో ఉన్నా అతని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఇక నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. అయితే పరిమిత ఓవర్ల ఆటలో బుమ్రా కీలకం కాబట్టి.. అతను లేని లోటు కనిపించనుంది. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం ఓ ప్లేయర్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసవ్వాలంటే.. 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్లు పరుగెత్తాలి లేదా యోయో టెస్ట్‌లో 17.1 స్కోరైనా సాధించాలి. మూడు నెలల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న వరుణ్‌.. ఈ మార్క్ అందుకోవడంలో ఫెయిలయ్యాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోసం వరుణ్‌ను ఇప్పటికే టీమ్‌లోకి ఎంపిక చేశారు. టీ20 సిరీస్‌కు మరో 10 రోజులు ఉండటంతో వరుణ్ చక్రవర్తిని మరోసారి యోయో టెస్ట్‌కు పంపించే అవకాశాలు ఉన్నాయి. గురువారం నుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై దుమ్మురేపుతున్న భారత్ చివరి టెస్టు కోసం సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తోంది. మొతెరాలో జరిగిన తొలి అంతర్జాతీయ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో.. అదనంగా మరో మూడు రోజులు కలిసిరావడంతో భారత ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో సోమవారం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా సాధన మొదలెట్టారు. స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు శ్రమిస్తున్నారు.