భద్రతా బలగాలే టార్గెట్‌గా రెచ్చిపోతున్న మావోయిస్టులు.

 


భద్రతా బలగాలే టార్గెట్‌గా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ ఏజన్సీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలను టార్గెట్‌ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్‌ మృతి చెందినట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ జిల్లా బర్సూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పాహుర్‌నార్‌ సమీపంలో ఇంద్రావతి నది నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల వద్ద 22వ బెటాలియన్‌కు చెందిన జవాన్‌ లక్ష్మీకాంత్‌ ద్వివేది సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం లక్ష్మీకాంత్‌ సమీపంలోని ఓ చెట్ట కింద భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ జవాన్‌ భోజనానికి కూర్చునేందుకు ప్రయత్నించగా, ఆ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజీవ్‌ డివైస్‌ (ఐఈడీ) భారీ విస్పోటనం చెంది ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో జవాను మృతదేహం శరీర భాగాలు చెల్లాచెదురైపోయి మాంసపు ముద్దలుగా పడిపోయాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న తోటి జవాన్లు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన లక్ష్మీకాంత్‌ మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనతో దంతేవాడ పోలీసు యంత్రాంగం అప్రమత్తమై మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మావోయిస్టులకు అడ్డాగా మారిపోయింది. ఆ రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో జరిగే ప్రభుత్వ పనులను సైతం అడ్డుకోవడం, వాహనాలను దగ్ధం చేయడం లాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వారి కోసం భద్రతా బలగాలు ప్రతినిత్యం గాలింపు చర్యలు చేపడుతూనే ఉంటారు. పేలుడు జరగడంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం భారీ ఎత్తున మోహరించారు.