ట్రికి బార్దర్లో మారో రైతు ఆత్మహత్య.

 


ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వంద రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యమం వంద రోజులు దాటినా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న నిరాశతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రైతు లేఖలో రాశాడు. ఆదివారం ఉదయం ఆందోళన చేస్తున్న టిక్రీ బోర్డర్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలోని ఓ చెట్టుకు రైతు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హర్యానాలోని హిస్సార్‌ జిల్లాకు చెందిన రాజ్‌బీర్‌ (49) గా గుర్తించారు. రైతు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బహదూర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ విజయ్‌కుమార్‌ తెలిపారు. సంఘటన స్థలంలో ఓ లేఖ కూడా లభ్యమైనట్లు వెల్లడించారు. మృతుడు గత కొంతకాలంగా తోటి రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఉద్యమం వంద రోజులు పూర్తయినా కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను విరమించుకొని రైతులకు మేలు చేయాలని సూసైడ్‌ నోట్లో రాజ్‌బీర్‌ పేర్కొన్నాడు. ఇదిలాఉంటే.. గత నెలలో కూడా హర్యానా జింద్‌కు చెందిన రైతు కూడా ఇదే ప్రాంతంలో ఉరేసుకుని చనిపోయాడు. మరో రైతు కూడా విషం తీసుకోగా.. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. గత మూడు నెలలనుంచి దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని ఆందోళన జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఇప్పటివరకు 12 సార్లు చర్చలు జరిగాయి. చివరిసారిగా జనవరి 22న చర్చలు జరిగాయి. అయితే ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. సవరణలు మాత్రమే చేస్తామంటూ కేంద్రం పేర్కొంటోంది. ఇదిలావుంటే.. వ్యవసాయ చట్టాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. సవరణలకు తాము సంసిద్దంగా ఉన్నామని.. కానీ రైతులే చర్చలకు రావడం లేదంటూ ఆయన ఆదివారం సాయంత్రం తెలిపారు.