మళ్లీ పంజా విసురుతున్న కరోనా రక్కసి.

 


కరోనా రక్కసి మళ్లీ పంజా విసురుతోంది.దేశంలో వైరస్ డేంజర్‌బెల్స్ మోగిస్తోంది. కరోనా కేసుల్లో కొద్ది రోజులుగా పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. మొత్తం కేసులు సంఖ్య కోటి 12 లక్షల 85 వేల 561కి చేరగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారితో ఒక లక్షా 58వేల189 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు ఎక్కువవుతుండటంతో యాక్టివ్ కేసుల్లో కూడా పెరుగుదల కనపడుతోంది. ప్రస్తుతం లక్షా 89 వేల 226 యాక్టివ్ కేసులుండగా..ఆ రేటు 1.68 శాతానికి చేరింది. అయితే వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కాస్త మెరుగ్గానే ఉంది. తాజాగా 18 వేల 100 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 96.92 శాతానికి చేరింది. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కలవరం పుట్టిస్తోంది. రోజూ సుమారు 10వేల కేసులు నమోదవుతున్నాయి.దేశంలోని కొత్త కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర వాటానే ఎక్కువగా ఉండటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటు తెలంగాణలోనూ కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 194 కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 1,855 ఉండగా ,డిశ్చార్జ్ రెండు లక్షల 97గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 3లక్షల 536 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో వెలుగుచూస్తోన్న రోజువారీ కేసుల్లో ఎక్కువ భాగం..మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్, తమిళనాడులోనే నమోవుతున్నాయి. తాజా కేసుల్లో 85.91 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే వెలుగుచూశాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 22,854 కొత్త కేసులు వెలుగు చూశాయి. సుమారు రెండు నెలల తరవాత ఈ స్థాయి కేసులు బయటపడ్డాయి. 126 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఆరు రాష్ట్రాలుల్లో 85.91 శాతం కేసులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది