సీరం ఇన్‌స్టిట్యూట్ కీలక నిర్ణయం.

 


భారత్‌లో టీకాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా దేశీయ అవసరాలు తీర్చేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విదేశాలకు ఎగుమతి చేయదలచిన టీకా డోసులను ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం కాకుండా కాస్తంత ఆలస్యంగా సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. బ్రెజిల్, సౌదీ అరేబియా, మొరొక్కో, దేశాలకు కరోనా టీకా ఎగుమతి చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ అంగీకరించిన విషయం తెలిసిందే. దీనితోపాటు.. టీకా ఉత్పత్తి సామర్థాన్ని కూడా మరింతగా పెంపొందించుకునేందుకు సీరం నిర్ణయించుకున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్రిటన్‌లో టీకా కార్యక్రమం కాస్తంత నెమ్మదించబోతున్నట్టు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సీరం నుంచి టీకా సరఫరా ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయని కూడా బ్రిటన్ ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో..సీరం నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.