పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్.

 


పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ ఒకటి ఆదివారం భారత సరిహద్దుల్లోకి ప్రవేశించింది. అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమై కాల్పులు జరపడంతో వెంటనే అది తిరిగి పాక్ వైపు వెళ్ళిపోయింది. పంజాబ్ పఠాన్ కోట్ జిల్లా సమీపంలోని దిండా పోస్ట్ వద్ద భారత-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ డ్రోన్ ని కనుగొన్నారు. భారత భూభాగంలోకి ఇది ఏమైనా జార విడిచిందా అని ప్రశ్నించగా..ఇప్పుడే ఈ విషయాన్నీ స్పష్టం చేయలేమని, క్షుణ్ణంగా గాలిస్తున్నామని, కానీ ఏమీ కనబడలేదని ఈ ఫోర్స్ అధికారులు చెప్పారు. గత ఏడాది డిసెంబరులో పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా సమీపంలో.. పాకిస్తాన్ కి చెందిన డ్రోన్ 11 హ్యాండ్ గ్రెనేడ్లను జార విడిచింది. ఒక పొలంలో వీటిని కనుగొన్నారు.ఓ నైలాన్ తాడుతో వీటిని జారవిడిచిందని అధికారులు గుర్తు చేశారు. అయితే వెంటనే వాటిని తీసుకువెళ్లి నిర్వీర్యం చేసినట్టు వారు చెప్పారు. 2019 సెప్టెంబరులో లోకూడా పాక్ డ్రోన్ రెండు పిస్టల్స్ ని కొన్ని మందుగుండు తూటాలను తరన్ తరన్ జిల్లాలో జారవిడిచింది. అందులో కొన్ని ఫేక్ కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. కాగా తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది