అరుణగ్రహంపై ‘నువా’ నగర నిర్మాణానికి డిజైన్‌ సిద్ధం.

 


అరుణగ్రహంపై ‘నువా’ నగర నిర్మాణానికి డిజైన్‌ సిద్ధం -రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించే గుహల్లాంటి నిర్మాణాలు -వీటిలో రెండున్నర లక్షల మంది నివాసం ఉండొచ్చు భవిష్యత్‌లో గ్రహాంతర టూరిజం వాస్తవం కానుంది. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్‌ మస్క్‌ 2050 నాటికి అరుణగ్రహంపై మనుషులు నివాసం ఉండేలా ఓ నగరాన్ని కట్టిస్తానని ప్రకటించాడు. ఈ గ్రహంపై ‘నువా’ అనే పేరున్న నగరానికి అబిబూ అనే ఆర్కిటెక్చర్‌ సంస్థ డిజైన్‌ కూడా సిద్ధం చేసింది. టెంపె మెన్సా అనే ఎత్తైన ప్రాంతం చివర్న .. రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించే గుహల్లాంటి నిర్మాణాల్లో రెండున్నర లక్షల మంది నివాసం ఉండటానికి డిజైన్‌ సిద్ధం చేసింది సంస్థ. ఒక్కో ఇల్లు 270–380 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వ్యవసాయానికి తగ్గ ఏర్పాట్లు చేసారు. ఇళ్ల కోసం గుహలను తొలిచే క్రమంలో మిగిలే వ్యర్థాలను రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు ఉపయోగిస్తారు. భూమిపై నుంచి అరుణగ్రహానికి వెళ్ళడానికి మూడు నెలల సమయం పడుతుందట. అక్కడి నుంచి మళ్లీ భూమికి వచ్చేందుకు స్పేస్‌ షటిల్‌ ఉపయోగపడుతుందట. అంతా బాగుంది కానీ ఎప్పుడు కడతారు దీన్ని? అయితే ఈ ప్రశ్నకు ఇప్పటికైతే అబిబూ స్పష్టమైన సమాధానం ఇవ్వట్లేదు. కాకపోతే ఎలన్‌ మస్క్‌ లాంటి వారు అరుణగ్రహంపైకి మనుషులను పంపగానే నిర్మాణమూ మొదలు కావొచ్చని అంచనా.