తిరుపతిలో కిడ్నాప్‌నకు గురైన ఆరేళ్ల బాలుడు సాహును విజయవాడలో గుర్తించారు.

 


తిరుపతిలో కిడ్నాప్‌నకు గురైన ఆరేళ్ల బాలుడు సాహు క్షేమంగా ఉన్నాడు. ఎట్టకేలకు అతని ఆచూకీ లభించింది. అలిపిరి బస్టాండ్‌లో కిడ్నాపైన బాలుడు సాహును విజయవాడలో గుర్తించారు. విజయవాడ దుర్గగుడి దగ్గర కిడ్నాపర్లు బాధిత బాలుడిని వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న విజయవాడ పోలీసులు.. బాలుడిని చేరదీశారు. అనంతరం చెల్డ్‌హౌమ్‌కు తరలించారు. బాలుడి దొరికిన విషయాన్ని విజయవాడ పోలీసులు.. అలిపిరి పోలీసులకు తెలిపారు. బాలుడు సాహును ఆదివారం నాడు అతని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఫిబ్రవరి 27వ తేదీన అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర బాలుడు సాహును కిడ్నాపర్లు అపహరించుకుపోయారు. దీనిపై అతని తల్లిదండ్రులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను తీవ్రం చేశారు. ఈ నేపథ్యంలో భయపడిపోయిన కిడ్నాపర్లు, ఇవాళ బాలుడిని విజయవాడ దుర్గ గుడి పరిసరాల్లో వదిలివెళ్లారు. కాగా, అక్కడి సీసీ కెమెరాల ఆధారంగా బాలుడిని వదిలి వెళ్లిన వారు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు విజయవాడ పోలీసులు.