ఏపీ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్, మున్సిపాలిటీలకు మేయర్, ఛైర్మన్ల జాబితా విడుదలకు సిద్దం.

 


అమరావతి: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్, మున్సిపాలిటీలకు తమ పార్టీ తరపున ఎన్నుకునే మేయర్, ఛైర్మన్ల జాబితాను ఈ రోజు సాయంత్రం వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించనున్నారు. సుదీర్ఘంగా కసరత్తు చేసి అభ్యర్థులను సీఎం జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల మేరకు అభ్యర్థులను సీఎం ఎంపిక చేశారని భావిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఏకాభిప్రాయంతో అభ్యర్థులను సీఎం ఎంపిక చేశారు. బీసీలు, మైనార్టీలకు పెద్దపీట వేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతోన్నాయి. ప్రాంతాల వారీగా సామాజిక సమీకరణలు, అభ్యర్థుల సమర్థత, స్థానికంగా పట్టు తదితర అంశాల ఆధారంగా అభ్యర్థులను సీఎం ఎంపిక చేశారని వారు భావిస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉన్న చోట్ల సీఎం స్వయంగా అభ్యర్థిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలను దాదాపుగా వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. 12 కార్పొరేషన్లకు గాను 11 కార్పొరేషన్లను, 75 మున్సిపాలిటీలకు దాదాపు 74 మున్సిపాలిటీలను వైసీసీ కైవసం చేసుకుంది.