ఏపీలో విజృంభిస్తున్న కరోనా వైరస్.

 


ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం సైతం అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. గత 24గంటల్లో ఏపీలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా కర్నూల్‌లో ఒకరు మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8,92,008 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 7,185 కి చేరింది. దీంతోపాటు గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 103 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 8,83,380 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,443 కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 45,208 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,45,57,366 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం 50-60 కేసులే నమోదు కాగా.. ప్రస్తుతం వందకుపైగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలను ప్రారంభించింది. అయినప్పటికీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. అయితే తాజాగా తిరుమల వేద పాఠశాలలో మరో 10మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. వారిలో ఆరుగురు విద్యార్థులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.