కేరళలో కాంగ్రెస్ కు భారీ షాక్..

 


తిరువనంతపురం : ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగమయ్యాయి. ఇదిలా ఉండగా.. కేరళలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు పలువురు నేతలు రాజీనామా చేస్తుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నియోజకవర్గమైన వయనాడ్‌లో వారం రోజుల వ్యవధిలోనే నలుగురు సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ నుంచి బయటికి వెళ్లారు. కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కెపిసిసి) మాజీ సభ్యులు కెకె విశ్వనాథన్‌, కెపిసిసి సెక్రటరీ ఎంఎస్‌ విశ్వనాథన్‌, డిసిసి జనరల్‌ సెక్రటరీ పికె అనిల్‌కుమార్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు సుయ వేణుగోపాల్‌ పార్టీని వీడారు. తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సమయంలో ఎంఎస్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. కెపిసిసి నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పికె అనిల్‌కుమార్‌ కాంగ్రెస్‌ను వీడి లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీలో చేరారు. కేరళలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ అప్రమత్తమైంది. ఒక్కొక్కరుగా సీనియర్‌ నేతలు పార్టీని వీడుతుండటంతో సమస్యలు చక్కదిద్దేందుకు, పరిస్థితులు వివరించేందుకు పలువురు సీనియర్‌ నేతలను వయనాడ్‌కు పంపింది