ఏపీలో పెట్టుబడులు పిలుపునిచ్చిన సీఎం జగన్.

 


ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నంబర్ 1 గా ఉండడాన్ని గర్విస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పోర్ట్ మౌలిక సదుపాయాలు, సపోర్ట్ ఎకో సిస్టమ్, పోర్ట్ అధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా అది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన వర్చువల్ గా మారిటైం ఇండియా సమ్మిట్ 2021 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీలో ఒక మేజర్ పోర్ట్ విశాఖపట్నంలో, 5 రాష్ట్ర పోర్టులు, 10 నోటిఫైడ్ పోర్ట్ లు ఉన్నాయని సీఎం చెప్పారు. ఏపీకి 170 మిలియన్ టన్నుల కార్గో సామర్ధ్యం ఉందని సీఎం ఈ సందర్బంగా చెప్పారు. జాతీయ ఎగుమతుల్లో ఏపీ వాటా 4 శాతమని, ఆ మొత్తాన్ని 2030 నాటికి 10 శాతానికి పెంచాలని సంకల్పంతో ఉన్నామని జగన్ అన్నారు. పోర్ట్ లను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ఈ నేపథ్యం లో మరో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భవనపాడులో పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని, 2023 నుండి ఆ పోర్టులు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని స్పష్టం చేశారు. దీనితో మరో 100 మిలియన్ టన్నుల కార్గో కెపాసిటీ పెరుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు 8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి సాగుతుందని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ, విదేశాలనుంచి భారీ ఎత్తున పెట్టుబడిదారులు ఈ సమ్మిట్ లో పాల్గొనాలని, ఏపీలో పెట్టుబడులు పెట్లాలని కూడా ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు.