మయన్మార్‌ విదేశాంగ మంత్రి జిన్ మార్ ఆంగ్‌తో మిజోరాం ముఖ్యమంత్రి జొరాంతంగ భేటి.

 


మయన్మార్‌లో స్థానిక జో తెగవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆ దేశ విదేశాంగ మంత్రి జిన్ మార్ ఆంగ్‌తో మిజోరాం ముఖ్యమంత్రి జొరాంతంగ ఆదివారం చర్చించారు. ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి, సైనిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకొన్న పరిస్థితులపై కూడా మాట్లాడారు. మయన్మార్ ప్రజలకు జొరాంతంగ సంఘీభావం ప్రకటించారు. ఈ వర్చువల్ సమావేశంలో అమెరికాలోని మిజో నేతలు కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జొరాంతంగ ఇచ్చిన ట్వీట్‌లో, ఆదివారం ఉదయం మయన్మార్ విదేశాంగ మంత్రి జిన్ మార్ ఆంగ్‌తో సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని తెలిపారు. ఈ పరీక్షా కాలంలో మయన్మార్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మయన్మార్ ప్రజల కష్టాలు, మానసిక ఆందోళన త్వరలోనే తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆ దేశ విదేశాంగ మంత్రితో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సైనిక పాలన ప్రారంభమైనప్పటి నుంచి మయన్మార్‌లోని స్థానిక జో తెగ ప్రజలు అణచివేతకు గురవుతున్నారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు ఈ సమావేశం జరిగింది. సైనిక పాలనలో దురాగతాలను తట్టుకోలేక దాదాపు 500 మంది మన దేశంలోని మిజోరాంలోకి చొరబడ్డారు. ఈ విధంగా చట్టవిరుద్ధంగా మన దేశంలోకి ప్రవేశించాలనుకునేవారిని నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే చొరబడినవారిని త్వరగా మయన్మార్‌కు పంపించాలని తెలిపింది.