కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.

 


న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారంనాడు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. స్థానిక ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ఆయన ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 1న తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో రోజైన సోమవారంనాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, నటుడు-రాజకీయనేత కమల్‌హాసన్, కేరళ ఆరోగ్ మంత్రి కేకే శైలజా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచంద్రన్, ఆయన సతామణి సుప్రవ హరిచందన్ తదితర ప్రముఖులు వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు రాగానే ఎలాంటి సంకోచాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. స్థోమత ఉన్న వారు వ్యాక్సిన్‌కు డబ్బు చెల్లించి వేయించుకోవచ్చని సూచించారు. కాగా, ప్రభుత్వ కో-విన్ పోర్టల్‌లో 50 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేయించుకున్నారు.