మహిళల భద్రతకు రైల్వే శాఖ కీలక నిర్ణయం.

 


భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల లోపల, రైల్వే ప్రాంగణాల్లో మహిళలపై జరగుతున్న నేరాలను నిరోధించడానికి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ ప్రయాణించే 2.3 కోట్ల మంది ప్రయాణికులలో.. 20% మంది మహిళలపై నేరాలు జరుగుతున్నాయని.. ఇది ఆందోళన కలిగించే విషయమని రైల్వేశాఖ తెలిపింది. మహిళా ప్రయాణికులపై నేరాలను అరికట్టేందుకు, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు వీలుగా రైల్వే మంత్రిత్వశాఖ మార్చి 20న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలంటూ రైల్వే జోన్ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ● రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతం, ప్లాట్‌ఫాంలు, మరుగుదొడ్ల వంటి ప్రదేశాల్లో నేరాలు అధికంగా జరుగుతున్నాయని ఆయా ప్రాంతాల్లో సరైన లైటింగ్, నిఘా వ్యవస్థ ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతోపాటు స్టేషన్ల పరిసరాల్లో అనవసరమైన నిర్మాణాలను కూల్చివేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ● వెయిటింగ్ రూముల్లో పకడ్భందీ భద్రత ఉండాలని.. రాత్రి వేళల్లో వ్యక్తులను తనిఖీ చేసి రూముల్లోకి అనుమతించాలని పేర్కొంది. ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పుడు గమనిస్తూ ఉండాలి. ● రైల్వే కోచ్‌లల్లోకి రాత్రివేళ అనుమానస్పద, అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా నిరోధించాలని మంత్రిత్వ శాఖ అధికారులను కోరింది. దీనికోసం ఎల్లప్పుడూ బోగీలను లాక్ చేసి ఉంచాలని వెల్లడించింది. ● రైల్వే ప్రాంగణంలో అనుమానస్పద వ్యక్తులెవరైనా కనిపిస్తే వారిపై నిఘా ఉంచాలని పేర్కొంది. అసాంఘిక కార్యకలాపాలపై, మహిళల నేరాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. ● సీసీటీవీ ఫుటేజీలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించింది. దీంతోపాటు.. ప్లాట్‌ఫాంల దగ్గర మహిళా కోచ్‌లు నిలిచే స్థానంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ● రైలు హాల్టింగ్ స్టేషన్లల్లో ప్లాట్‌ఫాం చివరి భాగాన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ / గవర్నమెంట్ రైల్వే పోలీస్ సిబ్బందిని మోహరించేలా చర్యలు చేపట్టాలి. ● మహిళల భద్రత, పరిశుభ్రత, ఇతర విషయాల గురించి అవగాహన కల్పించాలని జోనల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ● మహిళలు, దివ్యాంగులు, చిన్నారుల పట్ల రైల్వే అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి సాయమందించాలని సూచించింది.