తెలంగాణా లో కేవలం 10లక్షల మంది రైతులకు మాత్రమే బ్యాంకర్లు పంట రుణాలు పంపిణీ.

 


అన్నదాతలకు బ్యాంకు రుణాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. కొత్తగా రైతులకు పంట రుణాలు ఇవ్వకపోవడం, పాత వాటిని రెన్యువల్‌ చేయడం.. కాగితాలపైనే సర్దుబాటు చేస్తుండడంతో పెట్టుబడి కోసం రైతుల చేతికి నగదు అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 60లక్షల మంది రైతులు ఉంటే, కేవలం 10లక్షల మంది రైతులకు మాత్రమే యాసంగిలో బ్యాంకర్లు పంట రుణాలు పంపిణీ చేశారు. చిన్న, సన్నకారు రైతులే సింహభాగమున్న రాష్ట్రంలో.. అతి తక్కువ మందికి పంట రుణాలు దక్కడం చాలా దా‘రుణ’మనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటల రుణ పరిమితిని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్‌బీసీ) ఏటా సవరిస్తున్నా.. దానిని క్షేత్రస్థాయిలో బ్యాం కర్లు అమలు చేయడం లేదు. అదేక్రమంలో సాగు విస్తీర్ణం పెరిగినప్పుడు బ్యాంకర్ల రుణ ప్రణాళిక పెరగాల్సి ఉన్నా.. ఆ స్థాయి లో పెరగడం లేదు. ఒకప్పుడు వానాకాలంలో ఎంత విస్తీర్ణంలో పం టలు సాగయ్యేవో.. ఇప్పు డు యాసంగిలోనూ అంతే విస్తీర్ణంలో పంట లు సాగవుతున్నాయి. నిరుటితో పోలిస్తే ఈ యాసంగిలో విస్తీర్ణం రెట్టింపు అయింది. రికార్డు స్థాయిలో 67.15లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. కానీ అందుకు తగినట్లు బ్యాంకర్ల రుణ ప్రణాళిక లేదు. వానాకాలంలో రూ.32 వేల కోట్ల టార్గెట్‌ పెట్టుకున్న బ్యాంకర్లు.. రూ.23వేల కోట్లు(72 శాతం), ఈ యాసంగిలో రూ. 21,287 కోట్లకు రూ.13,095 కోట్లు(62శాతం) మాత్రమే పంపిణీ చేశారు. రెన్యువల్‌కే ప్రాధాన్యం బ్యాంకర్లు ఇస్తున్న రుణాలు సైతం నగదు రూపంలో చేతికి రావడం లేదు. రుణమాఫీ పథకం అమలులో జాప్యం జరగడం, ఇప్పటికీ ఆ పథకం పూర్తికాకపోవటంతో రుణ పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రూ.లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని, రైతుల పేరిట బ్యాంకుల్లో డబ్బు జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రెండేళ్లు సాగదీసి చేతులెత్తేసింది. ఎవరి బ్యాంకు అప్పులు వారే చెల్లించుకోవాలని... తాము ఇవ్వాలనుకున్నది రైతులకు నేరుగా ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. కొందరు రైతులు లోన్‌ రెన్యువల్‌ చేసుకున్నా... ఎక్కువ మంది రుణమాఫీ కోసం ఎదురుచూస్తూ రెన్యువల్‌ చేసుకోలేదు. దీంతో బ్యాంకులో అప్పు, వడ్డీ తడిసి మోపెడైంది. గడిచిన వానాకాలం సీజన్‌లో పంపిణీ చేసిన రూ.23 వేల కోట్లు గానీ, ఇప్పుడు పంపిణీ చేసిన రూ.13,095 కోట్లు గానీ.. దాదాపుగా రెన్యువల్‌ చేసినవే కావడం గమనార్హం. బ్యాంకర్లు పెట్టే ఇబ్బందులు, తిరకాసులు, వడ్డీ లెక్కలు, రుణమాఫీ బకాయిలు, చక్రవడ్డీ లెక్కలతో.. కొందరు రైతులు బ్యాంకుల్లో అడుగుపెట్టే పరిస్థితిలేదు. అందుకే రుణ గ్రహీతల సంఖ్య ఈ యాసంగిలో 10 లక్షలకు మించలేదు. ఐదారు నెలలు సాగదీసి.. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో 59.48 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 52.49 లక్షల మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే! ఈ వర్గాలకు బ్యాంకు రుణాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల సంఖ్యతో పోలిస్తే.. కేవలం 16.66 శాతం మందికే బ్యాంకుల నుంచి పంట రుణాలు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తున్నా.. అది ఏమూలకు సరిపోని పరిస్థితి ఉంది. ఎకరం వరి సాగు చేయాలంటే.. తక్కువలో తక్కువగా రూ.30 వేల పెట్టుబడి అవుతోంది. మిగిలిన రూ.25 వేల పెట్టుబడి కోసం ప్రైవేటు అప్పులు చేయక తప్పడం లేదు. వరికి రుణ పరిమితి రూ.34- 38వేలు నిర్ణయించారు. రైతులందరికీ ఈ లెక్కన బ్యాంకు రుణం అందితే పెట్టుబడికి ఇబ్బంది ఉండదు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇక రైతు సాగు ప్రారంభించే సమయంలో రుణాలు ఇవ్వకుండా.. ఐదారు నెలలు సాగదీస్తుండటం మరో సమస్య!