భారత్‌, చైనా మధ్య శుక్రవారం 11వ రౌండ్‌ సైనిక చర్చలు

 


భారత్‌, చైనా మధ్య శుక్రవారం 11వ రౌండ్‌ సైనిక చర్చలు జరిగాయి. తూర్పు లఢఖ్‌ ప్రాంతంలో వివాదాస్పద ప్రాంతాలైన హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా, దెస్పాంగ్‌లలో ఇరుదేశాల మధ్య బలగాల ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించి ఇరుదేశాలకు చెందిన అధికారులు చర్చించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి)కి భారత్‌ వైపున ఉన్న చుషూల్‌ ప్రాంతంలో ఉదయం 10.30 గంటలకు రెండు దేశాలకు చెందిన కోర్‌ కమాండర్‌ స్థాయి అధికారులు భేటీ అయ్యారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ పిజికె మీనన్‌ నేతృత్వంలోని భారత అధికారుల బృందం ఈ చర్చల్లో పాల్గంది. వివాదాస్పద ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణను వెంటనే చేపట్టాలని భేటీలో భారత్‌ కోరినట్లు బృందంలోకి సభ్యుడొకరు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 10వ రౌండ్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత ప్యాంగ్యాంగ్‌ త్సో సరస్సుకు ఉత్తర, దక్షిణ ఒడ్డున మోహరించి వున్న బలగాలు, యుద్ధ ఆయుధాలను రెండు దేశాల సైన్యం వెనక్కు తీసుకున్నాయి.