18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం

 


ఏపీలో లాక్‌ తప్పలేదు. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు తప్పనిసరి అని భావించిన ప్రభుత్వం.. నైట్ కర్ఫ్యూ పెట్టేసింది. అంతేకాదు.. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఎన్నడూ లేనంతగా…పదివేల మార్క్‌ దాటి పాజిటివ్ నిర్ధారిస్తున్నారు. అటు మరణాల సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వం హెచ్చరించినా…జనం మారడం లేదు. దీంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.


ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని ఆళ్ల నాని తెలిపారు. రాత్రిపూట కర్ఫ్యూ కోసం పోలీసులు సన్నద్ధం అయ్యారు. ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తామంటున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దన్నారు.


మరోవైపు కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌పైనా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆళ్ల నాని తెలిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి వ్యాక్సిన్ సరఫరాపై భారత్ బయోటెక్ సీఎండీతో సీఎం జగన్ స్వయంగా మాట్లాడరన్నారని వెల్లడించారు.


కరోనా వ్యాప్తిపై సమీక్ష జరిపిన సీఎం జగన్.. ఆక్సిజన్ సప్లై, రెమ్‌డెసివిర్, బెడ్స్‌కు సంబంధించిన వివరాలన్నీ ఉన్నతాధికారును అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.