భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌

 


భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌తో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుందని, రికవరీ ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని గ్లోబల్‌ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ అంచనా వేసింది. మార్కెట్‌, వినిమయ సెంటిమెంట్‌పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే గత ఏడాది విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు భిన్నంగా నిర్ధిష్ట నియంత్రణలనే పాటించడం, ముమ్మరంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతుండటం ఆర్థిక వ్యవస్ధపై పెను ప్రభావాన్ని తగ్గించవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ తాజా నివేదిక వ్యాఖ్యానించింది. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య అత్యల్పంగా ఉండటం, యువ జనాభా అధికంగా ఉండటం కొవిడ్‌ ముప్పును పరిమితం చేస్తుందని పేర్కొంది.

గత ఏడాది మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో అప్పటితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రెండంకెల జీడీపీ వృద్ధిని సాధిస్తుందని తెలిపింది. భారత్‌లో వైరస్‌ రెండో దశను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్‌ కీలక ప్రక్రియని దీన్ని లోటుపాట్లు లేకుండా సమర్ధంగా చేపట్టాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఏడు శాతం మైనస్‌ వృద్ధిని నమోదు చేసిన క్రమంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవడంతో 2022 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం వృద్ధి సాధిస్తుందని మూడీస్‌ ఫిబ్రవరిలో పేర్కొంది. ఇక ఐఎంఎఫ్‌ సైతం భారత్‌ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 12.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది.