జూలై 1వ తేదీ నుంచి కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశం నాటికి మొత్తం మెడికల్ కాలేజీలకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నుంచి పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల వరకు జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్‌వోపీలు రూపొందించాలన్నారు.
వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మెడికల్ కాలేజీల్లో రిక్రూట్మెంట్ పకడ్బందీగా జరగాలని.. వైద్యులు, సిబ్బంది కొరత ఉందనే విమర్శలు రాకూడదని చెప్పారు. మెడికల్ డిపార్ట్మెంట్లు అన్నీ ఒకే గొడుగు కింద ఉంటే.. రిక్రూట్మెంట్ సులువుగా, ఒక పద్ధతిగా జరుగుతుందని అన్నారు.
నాడు–నేడు కింద చేపట్టే పనులకు ఇచ్చే నిధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీలకు గాను 8 కాలేజీలకు భూసేకరణ పూర్తయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన ఎనిమిదింటికి కూడా భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 16 కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన స్టేటస్‌ను అధికారులు సీఎంకు వివరించారు.