టీ20 వరల్డ్‌కప్ జరుగుతుందా అన్న అనుమానాలు

 


ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అసలు టీ20 వరల్డ్‌కప్ ఇక్కడ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఐదు నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ప్రత్యామ్నాయ వేదికగా ఎంపిక చేసి స్టాండ్‌బైగా ఉంచినట్లు డైలీ మెయిల్ అనే ఇంగ్లిష్ పత్రిక వెల్లడించింది. టీ20 వరల్డ్‌కప్ విషయంలో అన్ని అంశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. అయితే ఈ టోర్నీ ఇండియాలో జరగకపోతే మాత్రం అభిమానులకు తీవ్ర నిరాశ తప్పదని ఆ పత్రిక అభిప్రాయపడింది.


ప్రస్తుతం ఐసీసీ ప్రతినిధి బృందం ఇండియాలో పర్యటిస్తోంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 9 వేదికలను ప్రతిపాదించింది. ఈ వేదికలను ఆ బృందం పరిశీలిస్తోంది అని ఆ రిపోర్ట్ తెలిపింది. గతేడాదే ఆస్ట్రేలియాలో ఈ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా వేశారు. దీంతో ఆ సమయంలో బీసీసీఐ యూఏఈలోనే ఐపీఎల్ నిర్వహించింది. ఇప్పుడదే యూఏఈ ఇండియాలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌ను కూడా ఎగరేసుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది.