ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికలు

 


ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికలు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఏప్రిల్ 30లోపు సభ్యులందరికీ బ్యాలెట్ పేపర్లు అందుతాయని మరోసారి తానా ఎన్నికల కమిటీ తాజాగా స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో టెక్నికల్ సమస్య కారణంగదా సభ్యుల చిరునామా మారడంతో బ్యాలెట్ పేపర్ల చేరవేతలో జాప్యం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం కోసం తానా సభ్యుల వివరాలతో యూఎస్‌పీఎస్ నేషనల్ చెంజ్ ఆఫ్ అడ్రసెస్(ఎన్‌సీఓఏ)ను కలిసినట్లు వెల్లడించింది. టెక్నికల్ సమస్య వల్ల సభ్యుల చిరునామాలు తారుమారు అయ్యాయని, వీటిని సరిచేసి ఏప్రిల్ 30లోపు సభ్యులందరికీ బ్యాలెట్ పేపర్లు అందేలా చూస్తామని ఎన్నికల కమిటీ ప్రకటించింది. దీనికోసం తమ బృందం సీటెల్ వెళ్లి.. దగ్గరుండి బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేయించనున్నట్లు పేర్కొంది. అనంతరం వాటిని ఏప్రిల్ 30 కంటే ముందే తానా సభ్యులకు చేరవేస్తామని స్పష్టం చేసింది.

ఇక ఇటీవల జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితాతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సభ్యుల వివరాలను కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేసింది. అలాగే యూఎస్‌పీఎస్ ఎన్‌సీఓఏ వద్ద ఓటర్ల జాబితాలో బయటపడిన అవకతవకలపై డా. హన్మయ్య బండ్ల, మురళి వెన్నం, డా. చౌదరి జంపాల సభ్యులుగా ఓ సబ్-కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ సబ్-కమిటీ రెండు వారాలలోపు ఓటర్ల జాబితాలోని తేడాలను గుర్తించి ఎన్నికల బోర్డుకు నివేదికను సమర్పిస్తుందని స్పష్టం చేసింది. దీనివల్ల భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుందని తానా ఎన్నికల కమిషన్ ఛైర్మన్ ఇన్నంపూడి కనకం బాబు పేర్కొన్నారు. ఇక బ్యాలెట్ పేపర్ల చేరవేతలో జాప్యం విషయాన్ని నరేన్ కొడాలి లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నరేన్ కొడాలి తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నారు. ఇదే పదవి కోసం కొడాలిపై నిరంజన్ శృంగవరపు పోటీ చేస్తున్నారు.