20 ఏళ్లు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్

 


దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేటితో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. 'నిధులు, నీళ్లు, నియామకాలు'నినాదంతో 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యం వేదికగా ప్రస్థానం ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ 14 ఏళ్ల పాటు ఉద్యమ బాటలో నడిచింది.పార్టీ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో స్వరాష్ట్ర సాధనకు సర్వశక్తులూ ఒడ్డిన టీఆర్‌ఎస్‌ 2014 జూన్‌ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేపట్టింది. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఎజెండాలో లేని ఇతర పథకాలను కూడా అమలు చేస్తూ 2018లో వరుసగా రెండో పర్యాయం కూడా టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఉద్యమ పార్టీగా, రాష్ట్ర సాధన తర్వాత అధికార పార్టీగా రెండు దశాబ్దాలుగా టీఆర్‌ఎస్‌ ప్రస్థానం కొనసాగుతోంది. అయితే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్ లో పార్టీ పతాకాన్ని ఎగురేశారు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవ రావు. ఈ సందర్బంగా కె .కేశవ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నేడు మరువలేని దినమని..రాష్ట్ర సాధన కోసం కన్న కలలను సాకారం చేసిన ఘనత కెసిఆర్ దేనని పేర్కొన్నారు.


తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగినా ఎన్నో కారణాలతో విజయవంతం కాలేదని.. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు. తెలంగాణ సాధనతో పని పూర్తి కాలేదు...తెలంగాణను బంగారు తెలంగాణగా రూపు దిద్దడమే కల అని గుర్తు చేశారు. కోటి ఎకరాల మాగాణి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని.. బంగారు తెలంగాణ కోసం ఉద్యమం మొదలైందన్నారు.