ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 22కి చేరింది.

 


ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 22కి చేరింది. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ వెల్లడించారు. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మావోల దాడితో అలర్ట్ అయిన జవాన్లు.. ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 22 మంది జవాన్లు మృతి చెందగా.. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇంకా ఆందోళనకర విషయం ఏంటంటే.. ఎన్‌కౌంటర్ తరువాత 24 మంది జవాన్లు కనిపించకుండా పోయారు. అదృశ్యమైన జవాన్ల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యను తీవ్రతరం చేశాయి. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. మావోయిస్టుల కోసం భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సుక్మా, దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల అడవులను క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు. అంతకుముందు ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మావోయిస్టుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న శత్రువులపై ప్రభుత్వం పోరాటం సాగిస్తుందని ప్రకటించారు. అలాగే ఈ ఎదురు కాల్పుల్లో అసువులుబాసిన జవాన్ల మృతికి సంతాపం ప్రకటించారు. అమరులైన జవాన్ల త్యాగం వృథా పోదని స్పష్టమైన ప్రకటన చేశారు.