ఛత్తీస్‌గఢ్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఏపీకు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సాయం.

 


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జరిపిన దాడిలో 24 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదంటూ ఆయన స్పష్టంచేశారు. అయితే ఈ ఘటనలో మరణించిన ఏపీకు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు సీఎం జగన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రెండు కుటుంబాలను కూడా ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని జగన్ పేర్కొన్నారు. అమరులైన ఇరువురు జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. బీజాపూర్‌- సుకుమా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు జరిపిన దాడిలో విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీ కృష్ణ అమరులయ్యారు. ఈ సహాయాన్ని వెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించింది. కాగా.. ఇద్దరు ఏపీ జవాన్లు మృతి చెందడం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.