రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి.

 


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఓవైపు ఎండలు దంచికొడుతుంటే మరోవైపు వడగాడ్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతోన్న ఉష్ణోగ్రతల వివరాలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసింది. ఈ సమాచారం ప్రకారం 78 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఇక రానున్న 24 గంటల్లో 83 మండల్లాలో, రానున్న 48 గంటల్లో 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం అత్యధికంగా దెందులూరు (45.3), వేలైర్పాడు (45.0), పమిడి ముక్కల (45.0), బెల్లంకొండ (45.3), తెనాలి (45.5), చేబ్రోలు (45.0), కురిచేడు (45.8), కోనకనమిట్ల (45.8)లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని, వేడి గాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం.. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలో తుపాను ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హెచ్చరించింది. వడగాల్పులు, మండుతోన్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎండలో ఎక్కువ సమయం ఉండే వారు వడదెబ్బ బారినపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలు రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.