కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

 


కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరుపనున్నారు. రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టుల్లో ఉపయోగించిన నీటి వివరాలను అందించాలని ఇప్పటికే బోర్డు కోరింది. వేసవి అవసరాలు, గడిచిన మూడు నెలల్లో నీటివాటా వినియోగంపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి 14 టీఎంసీలు తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరినట్లు తెలుస్తున్నది.


ఇంతకు ముందు కృష్ణా బోర్డు భేటీ ఫిబ్రవరి 5న జరిగింది. ఇదిలా ఉండగా.. గతేడాది వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే నిలిచిపోయింది. ప్రస్తుతం 35.73 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ ఏడాది నీటి నిల్వ కనీస మట్టం కన్నా కిందకు వెళ్లకూడదని గతంలో జరిగిన సమావేశంలో కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోగా.. వేసవి ఆరంభానికే ముందే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.