కరోనా సెకండ్ వేవ్ వలన మళ్లీ సినిమాల వాయిదా

 


కరోనా విజృంభణ వలన దర్శక నిర్మాతల ప్లానింగ్స్ ఒక్కటి కూడా వర్కవుట్ కావడం లేదు. చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వాలన్నా, లేదంటే రిలీజ్ డేట్ ప్రకటించాలన్నా కూడా వందల సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది మొదట్లో చాలా సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించగా, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వలన మళ్లీ వాటిని వాయిదా వేశారు. ఇక తమిళ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ కుమార్ 50వ పుట్టినరోజును పురస్కరించుకొని మే 1న వాలిమై ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని గతంలో పేర్కొన్నారు.


కాని ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని సునామిలా వ్యాపిస్తుంది. అయినవారిని కోల్పోయి చాలా మంది శోకసంద్రంలో మునిగిపోయారు. వారి మానసిక వేదనను అర్ధం చేసుకొని మే 1న వాలిమై ఫస్ట్ లుక్ విడుదల చేయాలని అనుకోవడం లేదని నిర్మాత బోనీ కపూర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్‌కు మళ్లీ నిరీక్షణ మొదలైంది. 'నెర్కొండ పార్వై' చిత్రం తర్వాత అజిత్‌, వినోద్‌, బోనీ కపూర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ, ప్రతినాయకుడిగా టాలీవుడ్‌ హీరో కార్తికేయ నటిస్తున్నారు.