'జగనన్న విద్యా కానుక'లో పెద్దఎత్తున గోల్‌మాల్

 


'జగనన్న విద్యా కానుక'లో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగింది. ఈ పథకం తొలి దశలో దాదాపు రూ.16కోట్ల అవినీతి చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయంలోనే గత ఎస్‌పీడీ చినవీరభద్రుడు, అడిషనల్‌ ఎస్‌పీడీ మధుసూదన్‌రెడ్డి కనుసన్నల్లో ఈ అవినీతి బాగోతం సాగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా కానుక కిట్లలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రస్తుత స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి తాజాగా సీఎం జగన్‌కు మెయిల్‌ చేయడంతో గుట్టురట్టయింది. విద్యాకానుక కిట్లకు సంబంధించిన వివిధ వస్తువుల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ నుంచి వాటిని పాఠశాలలకు సరఫరా చేయడం, బిల్లుల చెల్లింపుల వరకు పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.


నాణ్యత లేని, నాసిరకం వస్తువులను మార్కెట్‌ ధర కన్నా అధిక రేట్లకు కొనుగోలు చేసేలా టెండర్లు ఖరారు చేయడం గమనార్హం. తమవారికి టెండర్లు కట్టబెట్టేందుకు షరతులు, నిబంధనల్లో మార్పులు చేయడం నుంచే కుంభకోణానికి తెరలేపినట్లు సమాచారం. పాఠశాలలకు నాసిరకం వస్తువులు సరఫరా చేసినట్లు, కొన్ని జిల్లాలకు తక్కువగా, పలు జిల్లాలకు డిమాండ్‌కు మించి కిట్లు పంపిణీ చేసినట్లు తెలిసింది.