ఏపీ లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ.

 


ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నూతన ఎస్‌ఈసీ నీలం సాహ్నీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన వేసిన పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇలా ఉంది…. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ను ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 1 న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తామని నొటిఫికేషన్‌లో తెలిపారు. ఈ నెల 10న పరిషత్‌ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నీలం సాహ్ని.. వరుస భేటీలతో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. రెండో రోజు రాజకీయ పార్టీలతో మీటింగ్‌ పెట్టారు. ఆ తర్వాతే ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వుుల జారీ చేశారు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. Ap Zptc Mptc Election Notification 2021 మరోవైపు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీలోని పలువురు నేతలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు, జ్యోతుల నెహ్రూ తన అసంతృప్తిని ఇప్పటికే ప్రకటించారు. కాగా బహిష్కరణ నిర్ణయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే అధినేత ఎన్నికలను బహిష్కరిస్తున్నారన్న విషయాన్ని గుమనించాలన్నారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక నిజాయితీగా జరిగితే తెలుగుదేశం విజయఢంకా మోగిస్తుందన్నారు.