ఇన్‌స్టాగ్రామ్‌ లో ‘రీమిక్స్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్.

 


టిక్‌టాక్‌ యాప్‌ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఈ యాప్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టిక్‌టాక్‌తో ఎంతో మంది సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారారు. తమలోని యాక్టింగ్‌ ట్యాలెంట్‌ను బయటపెడుతూ క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఈ యాప్‌లో ఉన్న ఫీచర్లే ఇంతటీ ప్రాముఖ్యతను సంపాదించుకోవడానికి ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే చైనాకు చెందిన ఈ యాప్‌పై భారత్‌లో నిషేధం విధించడంతో.. టిక్‌టాక్‌ లేని లోటును తీర్చడానికి రకరకాల యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌ను ముంచెత్తాయి. ఇక అప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని సోషల్‌ మీడియా యాప్‌లు సైతం టిక్‌టాక్‌ను పోలిన ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా యూత్‌లో బాగా క్రేజ్‌ సంపాదించుకున్న ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలోనే ‘రీల్స్‌’ పేరుతో ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి ‘రీమిక్స్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను జోడించిందీ యాప్‌. టిక్‌టాక్‌లో ఉన్న ‘డ్యూయట్‌’ ఆప్షన్‌ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఆప్షన్‌ ద్వారా ఒకేసారి ఇద్దరు యూజర్లు వీడియోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఇదే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో టిక్‌టాక్‌ను పోలినట్లే డ్యూయట్‌ వీడియోలు తీసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘రీమిక్స్‌’ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. * మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో ‘రీల్స్‌’ సెక్షన్‌ను ఓపెన్‌ చేయాలి. * అనంతరం ఏదో ఒక మీడియా కంటెంట్‌ను సెలక్ట్‌ చేసుకొని మూడు చుక్కలు ఉండే మెనూను సెలక్ట్ చేసుకొని ‘రీమిక్స్‌ దిస్ రీల్స్‌’ ఆప్షన్‌ను నొక్కాలి. * సెలక్ట్ చేసుకోగానే స్క్రీన్‌ రెండుగా విడిపోతుంది. ఒరిజినల్‌ వీడియో ఎడమవైపు రాగా.. మీరు చేసే వీడియో కుడివైపు వస్తుంది.