అర్మేనియన్లపై మారణకాండ ఊచకోత

 


అర్మేనియన్లపై మారణకాండను ఊచకోతగా తాము గుర్తిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ చేసిన ప్రకటనపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ కుతకుతలాడుతున్నారు. టర్కీలోని అమెరికా రాయబారిని రప్పించుకుని టర్కీ ప్రభుత్వం తన నిరసనను తెలియజేసింది. బైడెన్‌ చర్య ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. అయినా, చారిత్రక అంశాలపై తీర్పు చెప్పే నైతిక హక్కు అమెరికాకు ఎవరిచ్చారని ప్రశ్నించింది. బైడెన్‌ ప్రకటన తమ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని విమర్శించింది. 'ఆ ఘటన జరిగి 100 సంవత్సరాలకు పైగా గడిచింది. ఇటువంటి సమయంలో అప్పటి గాయాలను నయం చేసి, భవిష్యత్తును నిర్మించేందుకు చేతనైతే తోడ్పడాలి. అంతేకానీ,ఈ విధంగా దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం సరికాదు' అని టర్కీ విదేశాంగ శాఖ పేర్కొంది. 106 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనపై బైడెన్‌ శనివారం స్పందిస్తూ..' ఒట్టోమాన్‌ శకంలో చోటుచేసుకున్న ఊచకోతకు గురైన ఆర్మేనియన్లను ప్రతి ఏడాది ఈ రోజున గుర్తుచేసుకుంటాం. ఇదే సమయంలో అటువంటి దారుణాలు మరోసారి జరగకుండా నిరోధించేందుకు మనకు మనం కట్టుబడాలి' అని పేర్కొన్నారు. శతాబ్ధ క్రితం నాటి ఘటనపై దర్యాప్తునకు ఒక జాయింట్‌ హిస్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్మేనియాకు టర్కీ ప్రతిపాదన చేసిందని విదేశాంగశాఖ తెలిపింది. బైడెన్‌ తన ప్రకటన ద్వారా చారిత్రక వాస్తవాలను విస్మరిస్తున్నాడని.. ఇది అమెరికాతో తమకున్న స్నేహం, నమ్మకంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. రాడికల్‌ అర్మేనియన్‌, టర్కీ వ్యతిరేక గ్రూపు ఒత్తిడి మేరకు అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేసినట్లు అర్థమౌతోందని టర్కీ విదేశాంగ శాఖ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.