ప్రముఖ దర్శకుడు శంకర్‌, బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ కలయికలో ఓ చిత్రం

 


ప్రముఖ దర్శకుడు శంకర్‌, బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ కలయికలో ఓ చిత్రం ఖరారైంది. తమిళం, తెలుగులో సూపర్‌ హిట్ అందుకున్న 'అపరిచితుడు' సినిమా రీమేక్‌గా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు దర్శకుడు శంకర్‌. 'ఈ సమయంలో నా కంటే ఆనందంగా ఉండే వ్యక్తి మరొకరు ఉండరు. రణ్‌వీర్‌ సింగ్‌తో సూపర్‌ హిట్‌ చిత్రం 'అన్నియన్‌' (తమిళం) రీమేక్‌ని తెరకెక్కిస్తుండటం గొప్ప అనుభూతిని పంచుతోంది' అని అన్నారు. ఈ చిత్రాన్ని పెన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


విక్రమ్‌ హీరోగా 2005లో 'అన్నియన్‌' చిత్రాన్ని తెరకెక్కించారు శంకర్‌. 'అపరిచితుడు' పేరుతో తెలుగులో విడుదలైంది. విక్రమ్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించి కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. సామాజిక కోణంలో సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.