నటి విజయలక్ష్మి పరిస్థితి దారుణం

 


తెలుగులో హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలో హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ లో నటించిన నటి విజయలక్ష్మి పరిస్థితి దారుణంగా మారింది. ఇంటి అద్దె చెల్లించలేదని... నటి విజలక్ష్మిని ఇంటి యజమాని.. అర్థరాత్రి బయటకు గెంటేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


టీనగర్‌ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్‌మెంట్‌లో విజయలక్ష్మి, ఆమె సోదరి ఉన్నారు. ఆమె సోదరి అనారోగ్యం పాలు కావడంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం రాత్రి డిశ్చార్జ్‌ కావడంతో ఇంటికి చేరుకున్న ఆమెకు షాక్‌ తప్పలేదు. తమ ప్లాట్‌లో మరో వ్యక్తి ఉండడంతో మేనేజర్‌ విఘ్నేశ్వరన్‌ను సంప్రదించారు. 


మూడు నెలలుగా అద్దె చెల్లించని దృష్ట్యా సామన్లు మరో గదిలో పెట్టినట్టు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన విజయలక్ష్మి, మీడియాకు సమాచారం అందించారు. తన సామాన్లు బయట పడేశారని, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ ప్లాట్‌లో రాజకీయ నేత హరినాడర్‌ అన్నయ్య తీసుకొచ్చి ఉంచారని, ఆయన్ను సంప్రదించకుండా తనను రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతం అయ్యారు.


కాసేపు తన దైన శైలిలో ఆమె హంగామా సృష్టించారు. తామేమీ ఆమె సామాన్లు బయట పడేయలేదని, ఓ గదిలో ఉంచామని, తమ ప్లాట్‌ సిబ్బంది శివాను చెప్పుతో కొట్టడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేనేజర్‌ విఘ్నేశ్వరన్‌ పేర్కొన్నారు. హరినాడర్‌కు ఈ ప్లాట్‌కు సంబంధం లేదని, ఆమెను జావెద్‌ అనే వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని పేర్కొన్నారు. 


అర్ధరాత్రి వేళ ఈ వ్యవహారం ముదరడంతో పాటు సీమాన్‌ నువ్వయినా ఆదుకో అంటూ విజయలక్ష్మి కన్నీటి పర్యంతం కావడంతో చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. తేనాంపేట పోలీసులు విచారించి విజయలక్ష్మికి ప్రత్యామ్నాయం కల్పించారు. అయితే ఇది తాత్కాలికం కావడం గమనార్హం. ఇన్నాళ్లు సీమాన్‌ను నోటికి వచ్చినట్టు దుమ్మెత్తి పోసిన విజయలక్ష్మి తాజాగా తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతం కావడం గమనార్హం.