సీఎం పళనిస్వామికి మద్రాసు హైకోర్టు నోటీసు జారీ

 


కోయంబత్తూరుకు చెందిన డీఎంకే నాయకుడు దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సీఎం పళనిస్వామికి మద్రాసు హైకోర్టు నోటీసు జారీ చేసింది. గతేడాది మార్చి 19న కోవైకు చెందిన డీఎంకే ప్రముఖుడు రాజేంద్రన్‌ చెన్నై నుంచి రైలులో స్వస్థలానికి వెళ్తుండగా అప్పర్‌ బెర్త్‌ నుంచి కిందకు దిగుతూ లోయర్‌బెర్త్‌లో ఉన్న మహిళపై పడ్డారు. ఈ సంఘటనపై ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై రాజేంద్రన్‌ క్షమాపణ చెప్పుకుంటూ తాను మధుమేహ రోగినని మూత్ర విసర్జన కోసం వేగంగా కిందకు దిగుతూ మహిళాపై పడ్డానని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దని రైల్వే పోలీసులను కోరింది. కాని పదిహేను రోజుల తర్వాత ఆయనపై రైల్వే పోలీసు లు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను ఉదహరిస్తూ సీఎం పళని స్వామి, మంత్రి వేలుమణి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డీఎంకే అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత ఉండదని ఆరో పణలు చేశారు. దీంతో డీఎంకే నాయకుడు రాజేంద్రన్‌ సీఎం ఎడప్పాడి, మంత్రి వేలుమణి తన పరువు ప్రతిష్టలను కించపరిచేలా ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారని ఆరో పిస్తూ తనకు రూ.కోటి నష్టపరిహారంగా చెల్లించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సంబంధిత మహిళ తనపై చేసిన ఫిర్యాదును హైకోర్టు రద్దు చేసిందని, వాస్తవాలు ఇలా ఉండగా తనను కించ పరిచేలా ప్రచార సభల్లో విమర్శలు చేశారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి వి. పార్తీబన్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎడప్పాడి పళనిస్వామికి నోటీసు జారీ చేసి కేసు తదుపరి విచారణను జూన్‌ 10కి వాయిదా వేశారు.