హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో మరోసారి ఉద్రిక్తత

 


హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుడ్స్‌మన్‌ అధికారిగా మా అభ్యర్థి కొనసాగుతాడంటే మా అభ్యర్థి కొనసాగుతాడంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత మాజీ కెపె్టన్‌ అజహరుద్దీన్‌ వర్గం, ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ వర్గం పరస్పరం మాటల యుద్ధానికి తెరలేపాయి. గత నెల 28న జరిగిన ఏజీఎం గొడవకు కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది.

అజహరుద్దీన్‌ అధ్యక్షతన మీటింగ్‌ ఆరంభం కాగా... రిటైర్డ్‌ జడ్జి దీపక్‌ వర్మను హెచ్‌సీఏ కొత్త అంబుడ్స్‌మన్‌గా ప్రకటించి... మద్దతు తెలిపే వారు చేతులు పైకి ఎత్తాల్సిందిగా సభ్యులకు సూచించాడు. జాన్‌ మనోజ్‌ వర్గం ఇందుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇవేమీ పట్టించుకొని అజహరుద్దీన్‌ కొత్త అంబుడ్స్‌మన్‌గా దీపక్‌ వర్మ నియామకం పూర్తయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అజహర్‌ వెళ్లిన అనంతరం ఉపాధ్యక్షుడు మనోజ్‌ అధ్యక్షతన ఏజీఎం కొనసాగింది. ఈ సమయంలో ఆయన మరో రిటైర్డ్‌ జడ్జి నిసార్‌ అహ్మద్‌ కక్రూను అంబుడ్స్‌మన్‌గా ఎన్నుకున్నామని ప్రకటించారు. అయితే అహ్మద్‌ కక్రూ నియామకం చెల్లదని అజహరుద్దీన్‌ వ్యాఖ్యానించాడు.