కోలీవుడ్‌లో అత్యంత బిజీగా నటుడు విజయ్‌ సేతుపతి.ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యంత బిజీగావున్న నటుడు విజయ్‌ సేతుపతి. అటు హీరోగా, ఇటు ప్రతినాయకుడిగా అద్భుతంగా రాణిస్తున్నారు. చేతిలో డజను చిత్రాలకు పైగా ఉన్నాయి. అదే సమయంలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా ఆయన ఓకే చెబుతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం 'విక్రమ్‌'. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తున్నారన్న వార్త కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.


ఈ విషయాన్ని విజయ్‌సేతుపతి వద్ద ప్రస్తావించగా, 'విక్రమ్‌' చిత్ర యూనిట్‌ నన్ను సంప్రదించిన మాట వాస్తవమే, అందులో ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నాను. అయితే, షూటింగు తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. 'విక్రమ్‌' చిత్రంలో కమల్‌తో పాటు మలయాళ నటుడు భగత్‌ఫాజిల్‌ ఉన్నారు. వారితో పాటు నేను కూడా చేరడం వల్ల ఆ చిత్రం మరింత బాగుండాలి. లేకపోతే ఆ ప్రాజెక్టు చేయడం వృధా ప్రయాసే అవుతుంది. వరుసగా విలన్‌ పాత్రల్లో నటించడంలో ఎలాంటి తప్పులేదన్నారు. ప్రేక్షకుల ఆకాంక్ష మేరకు అలాంటి పాత్రలను చేయడంలో తప్పులేదని విజయ్‌ సేతుపతి చెప్పుకొచ్చారు. కాగా, విక్రమ్‌ చిత్రానికి యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగు ప్రారంభంకాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తదితర కారణాల రీత్యా ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది.