హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్‌లు.

 


క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను స్వదేశంలో ఎలాగైనా నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతోన్న నేపధ్యంలో హైదరాబాద్, ఇండోర్ స్టేడియంలను స్టాండ్‌బై వేదికలుగా ఉంచినట్లు తెలిపింది. ఐపీఎల్ 14వ సీజన్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలబడనున్నాయి. అయితే టోర్నీ మొదలుకాక ముందే వాంఖడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అటు మహారాష్ట్రలో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో లాక్‌డౌన్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ముంబైలో జరిగే మ్యాచ్‌లపై సందిగ్దత నెలకొంది. దీనితో స్టాండ్‌బై వేదికలను సిద్దం చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఏదైనా నగరంలో కరోనా కేసుల పెరుగుదల వల్ల టోర్నీకి ఆటంకం ఏర్పడితే.. హైదరాబాద్‌కు ఆ మ్యాచ్‌లు తరలించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దాదాపుగా ముంబైలో జరిగే మ్యాచ్‌లన్నీ కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.