భారత విమానాలకు బ్రిటన్ బ్రేక్



భారత విమానాలకు బ్రిటన్ బ్రేక్ వేసింది. హీత్రూ విమానాశ్రయంలోకి భారతీయ విమానాలకు ఎంట్రీ కల్పించలేదు. అదనపు విమానాలను బ్రిటన్ అడ్డుకున్నది. భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇండియాను రెడ్ లిస్టు జాబితాలో పెట్టింది ఆ దేశం. ఇటీవల బ్రిటన్‌లో భారత్ వేరియంట్లకు చెందిన సుమారు వంద కరోనా కేసులను గుర్తించింది. దీంతో భారత్ నుంచి వస్తున్న విమానాలపై ఆంక్షలు విధించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాంకాక్ తెలిపారు. ఇండియాను రెడ్ లిస్టులో చేర్చాలని నిర్ణయించామని, యూకే లేదా ఐరిస్ లేదా బ్రిటీష్ నివాసి కాని వారు ఎవరైనా భారత్ నుంచి వస్తే వారికి ఎంట్రీ కల్పించడం లేదని హ్యాంకాక్ తెలిపారు. గడిచిన 10 రోజులు భారత్‌లో ఉండి.. అక్కడ నుంచి బ్రిటన్‌కు వస్తున్నవారిపై ఆంక్షలు వర్తిస్తాయన్నారు. పాస్‌పోర్ట్ కంట్రోల్ రూమ్ వద్ద అధిక సంఖ్యలో జనం క్యూకడుతున్న నేపథ్యంలో.. భారత్ నుంచి వస్తున్న అదనపు విమానాలకు అనుమతి ఇవ్వడంలేదని హీత్రూ విమానాశ్రయం పేర్కొన్నది.