మీకు ప్రైజ్ మనీ వచ్చింది ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి...

 


మీకు ప్రైజ్ మనీ వచ్చింది ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి... వ్యాక్సిన్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ ఇటీవల కొన్ని ఫేక్ లింక్ లు వాట్సాప్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ లింక్ పై క్లిక్ చేసి మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ లో మరో ఫేక్ లింక్ షేర్ అవుతోంది. వాట్సాప్ పేరు చెప్పే వాట్సాప్ వినియోగదారులను మోసం చేస్తున్నారు కొందరు సైబర్ కేటుగాళ్లు. సాధారణంగా కనిపించే ఆకుపచ్చ రంగులో కాకుండా కొత్త రంగులో వాట్సాప్‌ వచ్చేసిందంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. ఆ కొత్త రంగు వాట్సాప్ ఎలా ఉంటుందో చూద్దామంటూ క్లిక్ చేసిన కొందరు అడ్డంగా బుక్ అవుతున్నారు. అచ్చంగా వాట్సాప్ లాగా నమ్మించేలా ఉండే ఆ లింక్ మీకు వస్తే ఆ లింక్ పై క్లిక్ చేయకండి. ఒక వేళ క్లిక్‌ చేస్తే మీ పేరు, మొబైల్‌ నెంబరు తదితర వివరాలు ఎంటర్ చేయాలని అడుతగుతుంది. ఒక వేళ మీరు ఆ వివరాలను నమోదు చేస్తే అనంతరం ఆ పేజీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఇంతటితో అయిపోతుంది అనుకుంటే పొరపాటే.


మీరు నమోదు చేసిన సమాచారం మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో పాటు మీ మొబైల్ లో ఉన్న మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా వారి చేతుల్లోకి వేళ్ల ప్రమాదం ఉంటుంది. ఆ లింక్ పై మీరు క్లిక్ చేసిన అనంతరం మీకు తెలియకుండానే మీ ఫోన్లో ఉన్న అందరు కాంటాక్టులకు ఆ లింక్ వెళ్లి పోతుంది. మీరు చేసే ఈ చిన్న మిస్టేక్ ద్వారా వారు కూడా మోస పోయే ప్రమాదం ఏర్పడుతుంది. మీరు సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూపులకు కూడా ఆ లింక్ మీకు సంబంధం లేకుండానే వెళ్లి పోతుంది.