అంతరిక్షంలో మనిషి నివసించేందుకు అవసరమైన అన్ని ప్రయోగాలు చేస్తోంది నాసా

 


అంతరిక్షంలో మనిషి నివసించేందుకు అవసరమైన అన్ని ప్రయోగాలు చేస్తోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఇందుకు ఆ సంస్థ ఎప్పటి నుంచో పరిశోధనలు ప్రారంభించింది. ఒకవేళ మనిషి రోదసిలో నివసించాల్సి వస్తే వారికి తగిన ఆహారం సమకూర్చడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అక్కడే ఆహారాన్ని సమకూర్చుకునేందుకు నాసా ప్రత్యేక పద్ధతుల్లో కూరగాయలు, మొక్కలను పండించేందుకు కృషి చేస్తోంది. తాజాగా అంతరిక్షంలో అద్భుతాన్ని సృష్టించారు వ్యోమగాములు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారు ఆకుకూరలు పండించారు. దీంతో భూమి వాతావరణం లేనిచోట తొలిసారిగా మొక్కలు నాటే (ప్లాంట్​ ట్రాన్స్​ప్లాంటేషన్​) ప్రయత్నం ఫలించింది. ఐఎస్​ఎస్‌ వ్యోమగామి​ మైఖేల్ హాప్​కిన్స్​ ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో భారీగా పంటలు పండించే ప్రయోగాలకు ఇది తొలిమెట్టుగా నాసా వ్యాఖ్యానించింది.


ఐఎస్​ఎస్​లో పంటలు పండించడం ద్వారా అందులోని వ్యోమగాములకు ఆహార కొరత లేకుండా చూడవచ్చు. అలాగే భవిష్యత్తులో ఇతర గ్రహాలకు వ్యోమగాములు ప్రయాణించే క్రమంలో భూమిపై నుంచే ఆహారం తీసుకెళ్లే కష్టాలు తీరనున్నాయి. అవసరమైనప్పుడు వ్యోమనౌకలో వారు అక్కడే పంటలు పండించుకోవచ్చని నాసా అభిప్రాయపడింది. నాసా చేపట్టిన ఎక్స్​పెడిషన్​ 64 కార్యక్రమంలో మైక్​ పనిచేస్తున్నారు. స్పేస్​ ఎక్స్​ క్రూ1 మిషన్​లో భాగంగా ఆయన అంతరిక్షానికి వెళ్లారు. రోదసిలో పలు మొక్కలు చనిపోవడం గమనించిన మైక్​, వాటిని తిరిగి నాటడం ప్రారంభించారు. మొలకల దశలో ఉన్న మొక్కలను ఒకచోట నుంచి మరోచోట నాటడం అనే ప్రక్రియ సాధారణంగా మొక్కలకు రిస్కుగా భావిస్తారు. కానీ ఐఎస్​ఎస్​లో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారని నాసా తెలిపింది.


మొత్తానికి అంతరిక్షంలో దిగ్విజయంగా అమరా, ఆవాలు అనే రెండు పంటలతో పాటు పాక్​ చోయి అనే మొక్కను కూడా పెంచారు నాసా శాస్త్రవేత్తలు. వీటి ఎదుగుదలకు 64 రోజుల సమయం పట్టిందని, ఈ పొడవైన ఆకుకూరలు స్పేస్​ స్టేషన్‌లో పెరిగాయని అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపింది. మొక్కల పువ్వులను పరాగసంపర్కం చేయడానికి చిన్న పెయింట్ బ్రష్‌ను ఉపయోగించినట్లు హాప్కిన్స్ తెలిపారు. పాక్ చోయి మొక్క పునరుత్పత్తి ప్రక్రియ తరువాత పుష్పించడం ప్రారంభించింది.


మరిన్ని ప్రయోగాలకు ఊతం..

దీనిపై నాసా స్పందిస్తూ.. 'మొక్కలు పూర్తిగా పరాగసంపర్కం చెందాయని నిర్ధారించుకోవడానికి హాప్కిన్స్​ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. అతడు ఎప్పుడూ ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. మొక్కల పరాగసంపర్కానికి పెయింట్ బ్రష్​ను ఉపయోగించిన తరువాత, మేము అధిక విత్తనోత్పత్తి రేటును చూశాం. హాప్కిన్స్ పండించిన పాక్ చోయి మొక్కలో సోయా సాస్, వెల్లుల్లిని జోడించి 20 నుంచి 30 నిమిషాల పాటు వేడి చేసి సైడ్ డిష్ గా తీసుకున్నారు' అని పేర్కొంది. వ్యోమగాములు అమరా ఆవపిండిలో చికెన్, సోయా సాస్​, బాల్సమిక్ వెనిగర్ వంటి పదార్థాలను జోడించి తీసుకోవచ్చని హాప్కిన్స్ వివరించారు. దీనికి క్రంచ్​ టేస్ట్​ వస్తుందని పేర్కొన్నారు.


వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో సాధారణంగా ప్రీ-ప్యాకేజ్డ్ ఆహారాన్ని తీసుకెళ్తారు. అయితే తాజా పరిశోధనలతో అక్కడే పంటలు పండించుకొని తినే అవకాశం లభిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలోనే కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి మిరియాలు, టమాటా విత్తనాలను అంతరిక్ష కేంద్రానికి పంపనున్నారు. భవిష్యత్తులో ఈ అంశంపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సైంటిస్టులకు తాజా ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.