ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్న ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ కీలక నిర్ణయం

 


ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్న ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కుటుంబసభ్యుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా రేపటి నుంచి తాను ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 'నా కుటుంబసభ్యులు కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. కాబట్టి ఈ కష్టకాలంలో నేను వారికి అండగా ఉండాలనుకుంటున్నాను. అందుకే ఈ ఐపీఎల్‌ సీజన్‌కు రేపటి నుంచి విరామం పలుకుతున్నాను. ఒకవేళ పరిస్థితులు కుదుటపడితే మళ్లీ ఆడేందుకు తిరిగొస్తా. ధన్యవాదాలు' అని అశ్విన్‌ ట్వీట్‌లో వెల్లడించాడు. కాగా, అశ్విన్‌ ట్వీట్‌పై దిల్లీ క్యాపిటల్స్‌ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా స్పందించింది. 'ఈ ఆపద సమయంలో అశ్విన్‌ కుటుంబానికి మా సహకారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం' అని పేర్కొంది. దిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ విరామం నిర్ణయం ప్రకటించాడు.