సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ శనివారం ప్రమాణం

 


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ శనివారం ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్‌ ఎన్‌వీ రమణతో రాష్ట్రపతి రామ్‌నా«థ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఫిబ్రవరి 17, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాటి నుంచి సుప్రీంకోర్టులో పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయిన జస్టిస్‌ఎన్‌వీ రమణను ప్రస్తుత సీజేఐ ఎస్‌ఏ బాబ్డే తదుపరి సీజేఐగా సిఫార్సు చేయగా ఈ నెల 5న రాష్ట్రపతి కోవింద్‌ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. సీజేఐగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆగస్టు 26, 2022 వరకూ కొనసాగనున్నారు.