తమిళనాడులోని తూత్తుకుడిలోని వేదాంతా స్టెరిలైట్‌ పరిశ్రమను పునరుద్ధరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి

 


 తమిళనాడులోని తూత్తుకుడిలోని వేదాంతా స్టెరిలైట్‌ పరిశ్రమను పునరుద్ధరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి కల్పించింది. ప్రస్తుత కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఆక్సిజన్‌ ఉత్పత్తి కోసం ఈ పరిశ్రమను తిరిగి తెరిచేందుకు కోర్టు అనుమతించింది. అయితే ప్రాణవాయువును మాత్రమే ఉత్పత్తి చేయాలని, ఇతర అవసరాలకు నడపకూడదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.


స్టెరిలైట్‌ పరిశ్రమ కాలుష్యానికి కారణమవుతోందని, పరిశ్రమను మూసివేయాలని గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో 2018లో రాష్ట్రప్రభుత్వం ఈ పరిశ్రమను మూసివేసింది. అయితే ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన వేళ ప్రాణవాయువు ఉత్పత్తి కోసం పరిశ్రమను తెరిచేందుకు అనుమతించాలని వేదాంతా గ్రూప్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.


దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వేదాంత తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. 'మేం కేవలం ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మాత్రమే తెరుస్తాం. విద్యుత్‌ ప్లాంట్‌ను నడపబోం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్‌ తీసుకుంటాం' అని స్వాలే కోర్టుకు వివరించారు. ఎన్నిరోజుల్లో ప్లాంట్‌ను ప్రారంభించగలరని ధర్మాసనం ప్రశ్నించగా.. 10రోజుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తిని మొదలుపెట్టగలమని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, ఇతర కక్షిదారుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీనిపై జస్టిస్‌ చంద్రచూడ్‌ అసహనం వ్యక్తం చేశారు. ''మనం జాతీయ విపత్తును ఎదుర్కొంటున్నాం. సంక్షోభంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో రాజకీయ విభేదాలకు తావుండకూడదు'' అని సూచించారు.


ఆక్సిజన్‌ ఉత్పత్తి కోసం స్టెరిలైట్‌ పరిశ్రమను తిరిగి తెరిచేందుకు ధర్మాసనం అనుమతి కల్పించింది. సర్వోన్నత న్యాయస్థానం స్థాయిలో ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి రాజకీయ కలహాలకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసింది.