ఫ్లిప్‌కార్ట్.. ట్రావెల్ అండ్ హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్రిప్‌లో కొంత వాటాను కొనుగోలు

 


వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ట్రావెల్ అండ్ హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్రిప్‌లో కొంత వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్​కు సంబంధించి రెండు కంపెనీల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు వచ్చాయని ఎకనామిక్​ టైమ్స్​ రిపోర్ట్​ స్పష్టం చేసింది. క్యాష్​, ఈక్విటీల రూపంలో మొత్తం 40 మిలియన్​ డాలర్ల మేర ఫ్లిప్​కార్ట్​ క్లియర్​ ట్రిప్​కు చెల్లించనుంది.15 సంవత్సరాల క్రితం ముంబైలో ప్రారంభమైన క్లియర్​ ట్రిప్​ ప్లాట్​ఫామ్​.. ట్రావెల్, హోటల్​ బుకింగ్​ సేవలను అందిస్తుంది. అయితే, గత ఏడాది నుంచి కరోనా కారణంగా హాస్పిటాలిటీ, ట్రావెల్​ రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుండటంతో.. నష్టాల్లోకి జారుకున్న క్లియర్​ ట్రిప్​ తన వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంపై క్లియర్​ ట్రిప్​కు చెందిన ఒక అధికారి బిజినెస్​ డైలీతో మాట్లాడుతూ​ "ఫ్లిప్​కార్ట్​తో చర్చలు జరిగాయి. త్వరలోనే ఈ డీల్​కు సంబంధించిన లావాదేవీలు ముగియనున్నాయి. త్వరలోనే మా భాగస్వామ్యం నుంచి అధికారిక ప్రకటన రావచ్చు. కరోనా వైరస్​ ప్రతికూల పరిస్థితుల కారణంగా నష్టాలను పూడ్చుకునేందుకు తమ వాటాని ఫ్లిప్​కార్ట్​కు అమ్మాలని నిర్ణయించింది" అని అన్నారు.


క్లియర్‌ట్రిప్​కు ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ అండ్ ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డిఎజి వెంచర్స్, గండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొవైడర్ కాంకర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు పెట్టుబడిదారులుగా ఉన్నాయి. కాగా, క్లియర్‌ట్రిప్ పెట్టుబడిదారుల మూలధనంలో సుమారు 70 మిలియన్ డాలర్లను సేకరించింది. చివరిసారిగా ఇది 2016లో నిధుల సమీకరణను చేపట్టింది. దీని ప్రస్తుత మార్కెట్​ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉంది. 'కరోనాతో విమాన ప్రయాణాలు రద్దవ్వడంతో లాభాలను క్లియర్​ట్రిప్​ పొందలేకపోయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు క్లియర్‌ట్రిప్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందనుంది. తద్వారా, ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ రంగంలో అగ్రస్థానమే స్థానమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.'అని క్లియర్​ ట్రిప్​ అధికారి పేర్కొన్నారు.