సాగర్ లో సభకు కెసిఆర్ సిద్ధం.

 


చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను టీఆర్ఎస్ ఆచరిస్తోంది. దుబ్బాక దెబ్బిచ్చిన అనుభవం నుంచి పాఠం నేర్చుకున్న గులాబీ దళం సాగర్ సమరాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భావిస్తోంది. సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు అన్ని తెప్పించుకున్న సీఎం కేసీఆర్.. నాగార్జునసాగర్‌లో సభ నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఫలితాలు టీఆర్ఎస్‌లో సమీక్షకు తెరలేపాయి. దుబ్బాకలో మంత్రి హరీష్‌పైనే భారం వేసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అటువైపు తిరిగి చూడకపోవడంతో సీన్ రివర్స్ అయింది. గ్రేటర్‌లో కేటీఆర్ వన్ మ్యాన్ షో నడిచిందన్న విమర్శలున్నాయి. వాటి ఫలితాలతో ఖంగుతిన్న టీఆర్ఎస్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహం మార్చింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఖేల్ ఖతమైందని భావిస్తున్న కాంగ్రెస్ జానారెడ్డి రూపంలో కేసీఆర్‌కు సవాల్ విసురుతోంది. సాగర్ నియోజకవర్గం జానారెడ్డికి కంచుకోట. అందుకే సీఎం కేసీఆర్ అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి 60 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జ్‌ను నియమించి ప్రచారసరళిని ముఖ్యంత్రే స్వయంగా పరిశీలిస్తున్నారు. సాగర్‌లో సభ ఏర్పాటు చేసే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఏప్రిల్ 10 లేదా 14న సాగర్ నియోజకవర్గంలో సీఎం సభ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.