ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంటర్, టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం పునపరిశీలన చేసుకోవాలని సూచించింది.


పిటిషనర్ల తరపున సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని, దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉంటుందని, ప్రస్తుత పరిస్థితిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనా? అనే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది.


పరీక్షలపై ప్రభుత్వం వెంటనే పున:పరిశీలన చేసుకోవాలన్నారు. మే 3వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసిన కోర్టు.. అదే రోజు ప్రభుత్వం అభిప్రాయాలను చెప్పాలని ఆదేశించింది. కోవిడ్ వచ్చిన విద్యార్థులు నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉండాలి కదా? పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించింది.


వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది వెల్లడించగా.. అదెలా సాధ్యం అవుతుందని ప్రశ్నించింది హైకోర్టు. కోవిడ్ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలరా? కోవిడ్ వస్తుందనే భయంతో పరీక్షలు రాయగలరా? అని ప్రశ్నించింది హైకోర్టు.


ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతోపాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మరోసారి ఆలోచించండి. పునరాలోచన చెయ్యాలని కోరింది.