రాఫెల్‌ డీల్‌పై తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ

 


రాఫెల్‌ డీల్‌పై తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరారు. కొత్తగా దాఖలైన పిటిషన్‌పై రెండు వారాల తర్వాత విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే పిటిషనర్‌కు తెలిపారు.


36 అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాలను 50 వేల కోట్లతో కొనుగోలుకు 2016లో ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందం కోసం భారత్‌కు చెందిన ఒక దళారికి ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ సంస్థ 1.1 మిలియన్‌ యూరోలు లంచంగా ఇచ్చినట్లు ఆ దేశానికి చెందిన మీడియాపార్ట్‌ ఇటీవల ప్రచురించింది. డెఫ్సిస్ సొల్యూషన్స్ అనే భారతీయ కంపెనీకి దసాల్డ్‌ ఏవియేషన్‌ 50 విమాన నమూనాల కోసం ఈ మేరకు బహుమతిగా ఇచ్చినట్లు ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తులో తేలిందని పేర్కొంది.

మరోవైపు భారత్‌లో డసాల్ట్ ఉప కాంట్రాక్టర్లలో ఒకరైన డెఫ్సిస్ ఈ ఆరోపణలను ఖండించింది. అవి పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంది. కాగా, డెఫ్సిస్ సొల్యూషన్స్‌కు చెందిన సుషేన్ గుప్తాపై అగస్టా-వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయగా బెయిల్ పొందారు.