చాపకింద నీరులా కరోనా సెకండ్ వేవ్

 


చాపకింద నీరులా కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనాను అరికట్టేందుకు అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని ప్రభుత్వాలు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణలో రాష్ట్రానికి సుమారు 24 లక్షలకు పైగా కొవిడ్ టీకా డోసులు సరఫరా చేయగా.. ఇప్పటికే 16.80 లక్షల డోసులు పంపిణీ చేశారు. మరో 8 లక్షల డోసులు అందుబాటులో ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 70-75 వేల మందికి తొలి, మలి డోసులు కలుపుకొని టీకాలను అందిస్తున్నారు. ఇదే తరహాలో టీకాలను పంపిణీ చేస్తే కేవలం 7-8 రోజులకు మాత్రమే సరిపోతాయి. మున్ముందు రోజుకు లక్ష-లక్షన్నర మందికి కూడా టీకాలివ్వాలని వైద్యశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో.. మూడు, నాలుగురోజుల్లో రాష్ట్రానికి డోసులను కేంద్రం పంపించకపోతే..పంపిణీ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల స్థాయుల్లో, ప్రైవేట్‌లో 20 పడకల ఆసుపత్రుల్లోనూ టీకాలను ప్రస్తుతం పంపిణీ చేస్తుండగా.. పని ప్రదేశాలు, గేటెడ్‌ కమ్యూనిటీ ఇళ్ల వద్ద కూడా టీకాలను ఇవ్వాలని ఇటీవలే కేంద్రం అనుమతించింది. రానున్న రోజుల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ మరింత వేగంగా జరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి సమయానికి టీకాలను సరఫరా చేయకపోతే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు. రాష్ట్రానికి టీకాలను పంపించడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పదేపదే సంప్రదించినా.. సానుకూల స్పందన రావడం లేదని, కేంద్ర అధికారులు త్వరితగతిన స్పందించకపోతే టీకాల పంపిణీకి ఆటంకం ఏర్పడే అవకాశాలుంటాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కొవిడ్‌ కట్టడిలో ముందు ఉండే వైద్యసిబ్బంది టీకాల స్వీకరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ సిబ్బంది కూడా ఆశించిన రీతిలో టీకాలను పొందడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 3లక్షల, 31వేల, 97 మంది వైద్యసిబ్బంది, 2 లక్షల, 57వేల, 239 మంది ఇతర ఉద్యోగులు టీకా పొందడానికి తమ సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. కానీ వీరిలో 2లక్షల, 28వేల, 663 మంది వైద్యసిబ్బంది, లక్షా, 19వేల, 143 మంది ఇతర ఉద్యోగులు మాత్రమే ఇప్పటివరకు తొలిడోసు టీకాలను పొందారు.